కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తున్న కోయిల్కొండ వాసులు కోయిల్కొండను కొత్తగా ఏర్పాటు చేయనున్న నారాయణపేట జిల్లాల్లో కలపొద్దని స్థానికులు నిరసన చేపట్టారు. మండల సరిహద్దు నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఎన్నిసార్లు ఆందోళన, నిరసనలు చేసిన అధికారులు స్పందించడం లేదని వాపోయారు. మహబూబ్నగర్ జిల్లాతోనే తమ మండలం అభివృద్ధి చెందుతుందని ఎంపీపీ కొత్తపల్లి రవి అన్నారు.
జిల్లా కేంద్రానికి చేరుకోగానే పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని నిలువరించడంతో అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. మహబూబ్నగర్ జిల్లా తమకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటే.. నారాయణ పేట 60 కిలోమీటర్ల దూరంలో ఉందని సింగిల్ విండో డైరక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
అనంతరం ప్రజా ప్రతినిధులు సంయుక్త కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.