కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకటరావు పేర్కొన్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై రెవెన్యూ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. దర్శనం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి శానిటైజ్ చేసి, దేవాలయంలోకి పంపించాలని అధికారులను ఆదేశించారు. భక్తులు తప్పనిసరిగా మాస్కు ధరించి, శానిటైజ్ చేసుకోని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
అత్యాధునిక పద్ధతులతో శానిటైజేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని, పవర్ స్పెయిర్, వాహనాల ద్వారా శానిటైజ్ చేయించాలని సూచించారు. తాగునీరు, విద్యుత్, మందులు, డాక్టర్లు, అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఆర్డీవో ఆధ్వర్యంలో 10 మంది అధికారులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గతంలో కంటే ఈసారి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు.
కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని జిల్లా పరిషత్ ఛైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అన్నారు. తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ముఖ్యమైన రోజుల్లో ఎక్కువ మంది పోలీసులను ఏర్పాటు చేస్తామని ఏఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
53 మంది పంచాయతీ కార్యదర్శులను జాతర వద్ద మోహరించనున్నట్లు డీపీఓ వెల్లడించారు. ఉదయం నుంచి రాత్రి వరకు పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తారని అన్నారు. కల్లు, మద్యం విక్రయాలు లేకుండా జాతరకు వచ్చే రహదారుల్లో సంచార బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం విక్రయాలు లేకుండా పోలీసుల సహకారంతో చర్యలు చేపడతామని ఎక్సైజ్ శాఖ అధికారులు వివరించారు. వచ్చిన భక్తులు వచ్చినట్లుగానే వెళ్లాలని బస చేసేందుకు అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : 'కాలీగ్రఫీ' కళలో రాణిస్తున్న వనపర్తి కుర్రాడు