No Uniforms and Books in Government Schools: విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పుస్తకాలు పాఠశాలలకు చేరుకోవాలి. తరగతులు ప్రారంభమయ్యే సమయానికి విద్యార్ధుల చేతుల్లో ఉండాలి. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నెలలు గడుస్తున్నా పాఠ్యపుస్తకాలు మాత్రం పూర్తి స్థాయిలో అందలేదు. జిల్లావ్యాప్తంగా మొత్తం 3230 సర్కార్ బడులుండగా.. అందులో సుమారు 3లక్షల 59వేల మంది విద్యార్దులు చదువుకుంటున్నారు.
వీళ్లందరికీ 21 లక్షల పాఠ్యపుస్తకాల్ని పంపిణీ చేయాల్సి ఉంది. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశ పెట్టడంతో కొత్త పుస్తకాల ముద్రణ ఆలస్యమైంది. పాఠ్య పుస్తకాల ముద్రణను 2 భాగాలుగా విభజించిన సర్కార్.. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మొదటి సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షల కోసం ఉండే సిలబస్‌ను మొదటి భాగంలో ముద్రించారు. ఆ తర్వాత జరిగే సిలబస్‌ను రెండో భాగంలో ముద్రిస్తున్నారు.
ప్రస్తుతానికి మొదటిభాగం మాత్రమే జిల్లాలకు చేరుకోగా వాటిలో కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు ఇంకా పిల్లలకు అందలేదు. ఒక్కోజిల్లాలో ఒక్కోతరగతికి కొన్నిసబ్జెక్టులు అందక విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతానికి సిలబస్ ముందుకు సాగేందుకు పూర్వవిద్యార్ధుల నుంచి పుస్తకాలు సేకరించి.. వాటిని విద్యార్ధులకు అందిస్తూ ఉపాధ్యాయులు తరగతులు నెట్టుకొస్తున్నారు.
సెప్టెంబర్ నాటికే మొదటి ఎస్ఏ పాఠ్య ప్రణాళిక సమయం ముగుస్తుంది. అక్టోబర్ నుంచి రెండో మదింపు పరీక్ష సిలబస్ ప్రారంభం కావాల్సిఉంది. ఆ పుస్తకాలు కూడా జిల్లా కేంద్రాలకైనా చేరుకోలేదు. పుస్తకాల పంపిణీలో జాప్యం కారణంగా సిలబస్ గందరగోళంగా మారుతోందని విద్యార్థులు వాపోతున్నారు. పాఠ్యపుస్తకాలతో పాటు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఏకరూప దుస్తులు సైతం అందించాలి. కానీ యూనిఫాం ఎంపిక సైతం ఆలస్యమైంది.
ఆగస్టు 15నాటికి కనీసం ఒక్క జత చొప్పునైనా విద్యార్థులకు అందించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అవీ అందాయా అంటే అదీ లేదు. ఉమ్మడి జిల్లాల్లో 30శాతం వరకే యూనిఫాం అందాయి. వేలల్లో అందించామని జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందలేదని ఉపాధ్యాయలు, విద్యార్ధులు చెబుతున్నారు. మన ఊరు -మన బడి కార్యక్రమం కింద దశలవారీగా అన్నిసర్కారు బడుల్లో వసతులు మెరుగు పర్చుతామని ప్రభుత్వం చెబుతుంది.
కానీ ప్రభుత్వం ప్రణాళికా లోపాలతో పుస్తకాలు, ఏకరూప దుస్తులే సకాలంలో అందించలేని దుస్థితి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నెలకొంది. ఇక మిగిలిన వసతుల కల్పన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పాఠ్యపుస్తకాల ముద్రణ, పంపిణీని వేగవంతం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
"పుస్తకాలు కొత్తవి రాలేదు. ఇచ్చినా కానీ కేవలం రెండు, మూడు సబ్జెక్టులు మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వం స్పందించి పాఠ్యపుస్తకాలను అందించాలని కోరుతున్నాం." -విద్యార్థులు
"ఏకరూప దుస్తులు రాలేదు. పుస్తకాలు కూడా పూర్తి స్థాయిలో రాలేదు. పాతపుస్తకాలను తీసుకొని విద్యార్థులకు ఇప్పించాం. దీనిపై ఉన్నతాధికారులకు విన్నవించాం. పుస్తకాలు రాగానే విద్యార్థులకు పంపిణీ చేస్తాం." -ఉపాధ్యాయులు
ఇవీ చదవండి: కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని సీఎం నిర్ణయం