Bandi Sanjay on New Secretariat Inauguration : మహబూబ్‌నగర్‌లో భాజపా కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సహా ఇతర నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. అధ్యక్ష ఉపన్యాసం చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. బీఆర్ఎస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దివాలా తీసిందని.. రూ.5 లక్షల కోట్ల అప్పుల పాలైందన్నారు. రూ.లక్ష కోట్లు కాళేశ్వరంపై ఖర్చు పెడితే మిగిలిన రూ.4 లక్షల కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు.
2014కు ముందు, ఇప్పుడు కేసీఆర్ కుటుంబ ఆస్తులెన్నో శ్వేత పత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 2014 నాటి తెలంగాణ ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టిన కేసీఆర్.. ఆ మహనీయుడి పుట్టినరోజున కాకుండా, తన పుట్టిన రోజున ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. 317 జీవోపై ఈ నెల 30లోపు స్పందించకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్కు జాతీయత, జాతీయ భావాలు లేవని దుయ్యబట్టారు.
కేసీఆర్ పుట్టినరోజున కొత్త సచివాలయం ప్రారంభిస్తారా? అంబేడ్కర్ పేరు పెట్టి మీ పుట్టిన రోజున ఎలా ప్రారంభిస్తారు? కొత్త సచివాలయం అంబేడ్కర్ జయంతిన ప్రారంభించాలి. దళితబంధు కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారు. 317 జీవో ద్వారా టీచర్లను ఇబ్బంది పెడుతున్నారు. 317 జీవోపై స్పందించకపోతే భారీ నిరసన చేపడతాం. బడ్జెట్ సమావేశాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. గవర్నర్ లేకుండా అసెంబ్లీ సమావేశాలు ఎలా ప్రారంభిస్తారు? అసెంబ్లీ సమావేశాల్లో అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. భారత్‌ను విశ్వగురుగా నిలబెట్టాలని మోదీ కృషి చేస్తున్నారు. రెండు మూడేళ్లలో ఆర్థికంగా భారత్ రెండో స్థానానికి చేరుతుంది. - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, పార్టీ బలోపేతం సహా వివిధ అంశాలపై నేతలు చర్చించారు. దిల్లీలో కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పార్టీ అగ్ర నేతల దిశానిర్దేశాన్ని వివరించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో తెలంగాణ అభివృద్ధి సాధ్యమని బీజేపీ నేత జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అంతకుముందు కార్యవర్గ సమావేశాల వేదిక వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుంది. ఎమ్మార్పీఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. దీంతో బీజేపీ శ్రేణులు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు...