bandi sanjay on trs : భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన 'జనం గోస- భాజపా భరోసా' బహిరంగ సభలో పాల్గొన్న బండి సంజయ్... కేసీఆర్పై విరుచుకుపడ్డారు. భాజపా అధికారంలోకి వచ్చాక గ్రూప్-1లో ఉర్దూ ద్వారా ఉద్యోగాలు పొందిన వారిని తొలగిస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పేరును పాలమూరుగా మారుస్తామని వెల్లడించారు.
''ఉర్దూ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్లను భాజపా అధికారంలోకి వచ్చాక తొలగిస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారు. పాతబస్తీలో విద్యుత్ సిబ్బందిపై దాడి జరిగితే ముఖ్యమంత్రి స్పందించలేదు. పాలమూరు గడ్డకు సేవ చేసే అవకాశం మాకు ఇవ్వండి.''
- బండి సంజయ్, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణకు మోదీ ప్రభుత్వం వేల కోట్ల నిధులు ఇస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్న యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలు చేస్తున్న దాడులపై కేసీఆర్ సర్కార్ స్పందించటం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు భాజపాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. లాక్‌డౌన్ సమయంలో భాజపా కార్యకర్తలు ఎంతో మంది ఆకలిని తీర్చారని గుర్తు చేశారు.
'పాలమూరు గడ్డను చూస్తే బాధ వేస్తోంది. ఎడారి లేకుండా పాలమూరును పచ్చగా చేసే అవకాశం ఉంది. పాలమూరును ఎడారిగా మారుస్తున్న తెరాసను ఎట్లా ఆదరిస్తున్నారు. భాజపాకు సహకరిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేయలేని పనిని చేసి చూపిస్తాం. అలంపూర్ను సస్యశ్యామలం చేస్తాం. పాలమూరు గడ్డ భాజపాకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం. 69 జీవోకు భాజపా అనుకూలం... తెరాస వ్యతిరేకం. పాలమూరు, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలను మోసం చేసింది కేసీఆర్.'
- బండి సంజయ్, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
రాహుల్ గాంధీ ఏమి చేయడానికి తెలంగాణకు వస్తున్నారని ఫైర్ అయ్యారు బండి సంజయ్. 14 వందల మంది విద్యార్థుల ప్రాణాలను కాంగ్రెస్ పార్టీ బలి తీసుకుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పి తెలంగాణకు రావాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి అయ్యాక రౌడీయిజం చేసి.. పేదలను దోచుకుంటున్నారని పేర్కొన్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక మంత్రి శ్రీనివాస్ గౌడ్ దోచుకున్న సొమ్మును ప్రజలకు పంచి పెడతామన్నారు.
ఇవీ చూడండి: