Bandi Sanjay Praja Sangrama Yatra: రాష్ట్రంలో యువత బలిదానాలకు కాంగ్రెస్ కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 21వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర చేశారు. మన్యం కొండ, ఓబులాయపల్లి, కోడూరు, అప్పాయిపల్లి, ధర్మాపూర్ గ్రామాల మీదుగా పాదయాత్ర నిర్వహించారు. మణ్యంకొండ అలివేలు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్న భోజన శిబిరం వద్ద పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులతో సమావేశమయ్యారు. అనంతరం ధర్మాపురం గ్రామంలో రైతులు, స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన బండి సంజయ్... కాంగ్రెస్ పార్టీని ప్రజలు ద్వేషిస్తున్నారని... అందుకే ఎన్నికల్లో ఓడించారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి ఉస్మానియాలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పాలనలో రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి సహా ఏ హామీలు నెరవేరలేదని బండి సంజయ్ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్లు, ఉపాధి హామీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలకు నిధులిస్తున్నా... ప్రజలకు చేరకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. రైతులు ఇబ్బంది పడుతున్నా... కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని... ఇప్పటికే 75 శాతం మంది రైతులు నష్టానికి ధాన్యాన్ని అమ్ముకున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో పంట పొలాల్లోని ధాన్యం నీటి పాలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దోళ్ల ప్రభుత్వం పోయి... పేదోళ్ల సర్కారు రావాలంటే భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.
మధ్యాహ్న భోజన శిబిరం వద్ద మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి బండి సంజయ్‌తో అరగంట పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రకు మంచి స్పందన వస్తోందని... ఆయన్ని అభినందించడానికే వచ్చినట్లు విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌కి వ్యతిరేకంగా భాజపా పోరాటం చేస్తోందని... ఆ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని ఆకాంక్షించారు. తండ్రి కుమారులకు ఢీకొట్టే శక్తి ఎవరికి ఉందో వారికి మద్దతు ఇస్తానని చెప్పినట్లు సమాచారం. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఇవాళ బండమీది పల్లి, మేనకా థియేటర్, వన్ టౌన్ చౌరస్తా, పాతపాలమూరు, బాలాజీ నగర్, భగీరథ కాలనీ, నాగేంద్ర నగర్, క్రిస్టియన్ పల్లి మీదుగా ఎంవీఎస్ కళాశాల మైదానం వరకు పాదయాత్ర జరగనుంది.
ఇవీ చూడండి: సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం హామీపై సర్కారు కసరత్తు..
'తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా మౌలిక సదుపాయాలు..'