అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం శతాబ్దాలుగా పోరాడుతున్నామని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కరసేవలో పాల్గొన్న 4 లక్షల మంది ఆహుతైనా ఎక్కడా వెనకడుగు వేయలేదన్నారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక దేశ అత్యున్నత న్యాయస్థానం రామమందిర నిర్మాణానికి అనుమతిచ్చిందని ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని వీరన్నపేట నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిధి సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రపంచ దేశాల్లోనే గొప్పగా రామమందిర నిర్మించబోతున్నామని.. దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ప్రతి ఇంటికి తిరిగి నిధిని సేకరిస్తామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈరోజు నుంచి 20 రోజులపాటు వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని స్పష్టం చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ వేపూరిగేరిలోని శ్రీ భీమలింగేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నిధి సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి ఈశ్వరపల్లి ఆంజనేయ స్వామి మందిరంలో భాజపా రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, శ్రీ రాజరాజేశ్వరి మందిరంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు.