Assigned lands in mahabubnagar : పేదలకు ప్రభుత్వం పంచిన భూములను కొందరు ఫలహారం చేస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారం ముసుగులో కొందరు ఉండగా, మరికొందరు దళారులుగా అవతారమెత్తి ప్రభుత్వ భూములకు అక్రమంగా అనుమతులు తెచ్చిపెడుతున్నారు. నగర శివార్లలో వందల ఎకరాలు పలువురు నాయకులు, వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాయి. ఎసైన్డ్ పోను మిగిలిన స్థలాలను ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించారు. కొత్త కలెక్టరేట్, ఐటీ పార్కుల నిర్మాణం జరుగుతున్న క్రమంలో చుట్టుపక్కల స్థలాల ధరలు రూ.కోట్లకు చేరాయి. సమీపంలోని ఎసైన్డ్ భూముల విక్రయాలు జోరందుకున్నాయి. ఎసైన్డ్ చట్టం ప్రకారం లావుణి క్రయవిక్రయాలు, దానం, బహుమతి చెల్లదు. సాగు కోసం పంపిణీ చేసిన భూముల్లో భారీ భవంతులు నిర్మిస్తున్నారు. చట్ట ప్రకారం సాగుభూమి మార్పిడికి ‘నాలా’ అనుమతులు పొందాలి. ఇవేమీ లేకున్నా పురపాలక శాఖ భవనాలకు ఉదారంగా అనుమతులిస్తుండగా.. అదే బాటలో కొళాయి, విద్యుత్ కనెక్షన్లు వస్తున్నాయి.
రూ.218 కోట్ల భూమికి రెక్కలు
ఎదిరలో సర్వే నంబరు 556, 607లలో 371.34 ఎకరాలను ఐటీ పార్కుకు కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ) భూసేకరణ జరిపి దీన్ని నిర్మిస్తోంది. ఇక్కడ భూమి విలువ ఎకరా రూ.2కోట్లకు పైనే ఉంది. రెండేళ్ల కిందట పార్కు కోసం ఈ రెండు సర్వే నంబర్లలో 481.06 ఎకరాలను తీసుకోనున్నట్లు ప్రకటించారు. రెవెన్యూ రికార్డుల్లోనూ అంతే విస్తీర్ణం నమోదై ఉంది. పార్కు నిర్మాణం వేగం పుంజుకున్నాక డీజీపీఎస్(డిఫరెన్సియేట్ గ్లోబల్ పోజిషనింగ్ సర్వే) చేపట్టారు. ఆ సమయంలో 371.34 ఎకరాలే భూమి ఉందని ప్రకటించారు. అంతే విస్తీర్ణానికి పరిహారమిచ్చేందుకు నోటిఫికేషన్ జారీచేశారు. 109 ఎకరాల స్థలం క్షేత్రస్థాయిలో లేదని ప్రకటించారు. దీనిపై పెద్దఎత్తున ఆందోళనలు చేసిన స్థానికులు తమ భూమిని భారీగా తగ్గించి చూపారంటూ ఆక్రోశించారు. నిస్సహాయ స్థితిలో చివరికి ఇచ్చిన పరిహారమే తీసుకున్నారు. వారి ఎసైన్డ్ భూములను కొందరు కావాలనే ‘మాయ’ం చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై దృష్టిసారించే అధికారులే లేకపోవటం విచిత్రం!
రూ.100 కోట్లకుపైగా లావాదేవీలు
మహబూబ్‌నగర్‌లోని క్రిస్టియన్‌పల్లి సర్వే నంబరు 523/1లో ఎసైన్డ్ భూమిని కొల్లగొడుతున్నారు. ఇక్కడ 83.28 ఎకరాల ప్రభుత్వం స్థలం ఉంది. 1980-2017 మధ్య కొందరు పేదలకు ప్రభుత్వం పట్టాలివ్వగా.. రెట్టింపు సంఖ్యలో ఆక్రమణలు జరిగాయి. 2017లో కలెక్టర్ అసలైన లబ్ధిదారులు 500 మందిని గుర్తించి ఆ భూములను వెనక్కు తీసుకున్నారు. అక్కడే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అక్కడే మరో 75 మంది దివ్యాంగులకూ పట్టాలచ్చారు. ఆపై.. మిగిలిన భూమికి నకిలీ పట్టాలు సృష్టించి కొందరు నాయకులు వాటిని అమ్మకానికి పెడుతున్నారు. వంద గజాల స్థలాన్ని రూ.10-20 లక్షలకు విక్రయిస్తుండగా.. 2000 మంది కొన్నట్లు అంచనా. చివరకు చిన్నవాగునూ మింగేశారు.
* పాలకొండ సర్వే నంబరు 282 ఉపసంఖ్యల్లో ఒకచోట ఓ పార్టీకి చెందిన ముఖ్యనేతకు 20 గుంటల భూమి ఉంది. అది ఎసైన్డ్ భూమి అని రికార్డులు చెప్తున్నాయి. పేదల కోసం సాగుకు ఉద్దేశించిన ఈ భూమిని గతంలో ఓ వ్యక్తికి కేటాయించారు. ఆయన నుంచి నాయకుడి కుటుంబ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా కొన్నారు. రెవెన్యూ దస్త్రాల్లో అది ఎసైన్డ్ అని చూపుతుండగా.. యజమానుల పేర్లు మాత్రం మారడం గమనార్హం. ఇప్పటికే ఈ భూమిలో ప్రహరీ నిర్మించి, బోర్లు వేశారు. దీన్ని స్వాధీనం చేసుకుని ఆధునాతన మార్కెట్‌ను నిర్మించాలని గతంలో అధికారులు ప్రణాళిక రూపొందించినా ఆ నాయకుడి ఒత్తిడి వల్ల పని జరగలేదు. ఈ భూమి వెల రూ.2 కోట్లకుపైమాటే.
- జిల్లా పేరు: మహబూబ్‌నగర్
- రెవెన్యూ గ్రామాలు: పాలకొండ, బోయపల్లి, మహబూబ్‌నగర్, ఎదిర, ఎనుగొండ, ఎర్రవల్లి
- ఎసైన్డ్, ప్రభుత్వ భూముల విస్తీర్ణం: 5000 ఎకరాలు
- పేదలకు ఎసైన్డ్ చేసిన విస్తీర్ణం: 2000 ఎకరాలు (దీనిలోనే అక్రమాలు)
* మహబూబ్‌నగర్ అర్బన్ మండలం పాలకొండ సర్వే నంబరు 79లోని భూమి అంతా లావుణి పట్టానే. 79/1లో 76 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సాగుచేసుకోవడానికి కొన్నేళ్ల క్రితం పేదలకు రెండు నుంచి అయిదు ఎకరాల వరకు లావుణి పట్టాలు ఇచ్చారు. స్థిరాస్తి వ్యాపారులు ఈ భూములను రైతుల నుంచి అగ్గువకు కొట్టేసి అమ్మకాలకు పెడుతున్నారు. గజాల చొప్పున ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ సగం ఎసైన్డ్ విస్తీర్ణం కనుమరుగయేందుకు సిద్ధంగా ఉంది. చేతులు మారిన భూముల విలువ రూ.170 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం..
మహబూబ్‌నగర్ శివార్లలోని పాలకొండ, ఎదిర, క్రిస్టియన్‌పల్లి పరిధిలో అసైన్డ్, ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న అక్రమాలపై ఆర్డీవో, తహసీల్దార్లతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేపడతాం. అక్రమాలు తేలితే నోటీసులిచ్చి ఆయా భూముల నుంచి ఖాళీచేయిస్తాం. ‘ధరణి’ వచ్చాక పరిస్థితి మారింది. క్రిస్టియన్‌పల్లి భూములపై మరో అదనపు కలెక్టర్ విచారణ జరుపుతున్నారు.
- సీతామారావు, అదనపు కలెక్టర్, మహబూబ్‌నగర్
ఇదీచూడండి: KTR on teenmar mallanna tweet: 'నడ్డాజీ.. ఇదేనా మీరు నేర్పిస్తోంది..? ఇదేనా మీ సంస్కారం..?'