ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యాసంగి సాగు భారీగా పెరిగింది. దాదాపు 5 జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణానికి మించి.... రైతులు ఈసారి పంటల్ని సాగు చేశారు. 4 లక్షల 89వేల ఎకరాలకుగాను ఇప్పటివరకూ 5 లక్షల 92వేల944 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గత ఏడాదితో పోల్చితే... లక్షా 60వేల ఎకరాలు అధికం. ఈసారి వరికే రైతులు ఎక్కువగా మొగ్గుచూపారు. వేరుశనగ, మినుములు, మొక్కజొన్న, పప్పుశనగ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా అన్నిజిల్లాల్లోనూ 100శాతానికి మించి పంటలు సాగయ్యాయి.
50 శాతం మించలేదు...
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి నివేదిక ప్రకారం.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8 వేల 990 కోట్లు పంట రుణంగా అందించాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టకున్నారు. అందులో వానాకాలం లక్ష్యం 5వేల395 కోట్ల రుణాలుగా అందించాల్సి ఉంది. సెప్టెంబర్ నాటికి 2వేల700 కోట్లు మాత్రమే రుణాలు అందించగలిగారు. అంటే వానాకాలం పంట రుణాలు.. 50శాతం మాత్రమే అందించగలిగారు. అక్టోబర్ నుంచి యాసంగి ప్రారంభమైంది. అక్టోబర్ మొదలుకొని మార్చి వరకూ 3వేల595 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టకున్నారు. కానీ ఇప్పటి వరకు యాసంగి లక్ష్యం సైతం అన్ని జిల్లాల్లో 35శాతానికి మించలేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో 824 కోట్లకు 344 కోట్లు.. వనపర్తి జిల్లాలో 588 కోట్లకు 210 కోట్లు.. నాగర్ కర్నూల్ జిల్లాలో 969 కోట్లకు... 318 కోట్ల పంట రుణాలను పంపిణీ చేశారు. జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోనూ 40శాతంలోపు రుణాలు పంపిణీ అయినట్లుగా తెలుస్తోంది.
సాంకేతిక కారణాలతో...
లక్ష లోపు రుణమాఫీ అమలవుతుందన్న కారణంగా రైతులు రుణాలు పునరుద్ధరించుకోవడం లేదు. రుణం చెల్లిస్తే మాఫీ అమలు కాదేమోనన్న అనుమానంతో.. 2018 నుంచి వాటిని చెల్లించకుండా అలాగే ఉంచేశారు. 25వేల రూపాయల లోపు బకాయిలున్న రైతులకు ఇప్పటికే ప్రభుత్వం రుణమాఫీ అమలు చేసింది. 25వేలకు పైన.. లక్ష లోపు బకాయిలున్న వారికి రుణమాఫీ అమలు కాలేదు. ధరణిలో కొందరు రైతుల భూములు కనిపించకపోవడం సహా పలు సాంకేతిక కారణాలతో బ్యాంకర్లు రుణాలకు తిరస్కరిస్తున్నారు.
గతేడాదిలోనూ.. పంటలు విస్తారంగా సాగైనా.... బ్యాంకర్లు పంట రుణాల లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. కొన్నిజిల్లాల్లో 70శాతం లక్ష్యాలను సైతం చేరుకోలేకపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. వచ్చే వానాకాలంలోనైనా సకాలంలో రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.