ఆసుపత్రి వర్గాల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంతో విసుగుచెందిన ఓ అంధుడు హైకోర్టును ఆశ్రయించి ఉద్యోగం తెచ్చుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన జి.మురళీధర్ మహిళ సంక్షేమ శాఖలో దివ్యాంగుల కోటాలో నాలుగో గ్రేడ్ బ్యాక్ లాగ్ టైపిస్టు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దరఖాస్తుదారుల్లో మొదటి స్థానంలో నిలిచి.. ఉద్యోగానికి అర్హత సాధించారు. అయితే మురళీధర్ దృష్టిలోపం ఎంత శాతం ఉందో తేల్చాలని అప్పటి కలెక్టర్ రోనాల్డ్ రాస్.. సరోజినిదేవి కంటిఆసుపత్రి సూపరింటెండెంట్‌కు పంపించారు. కానీ ఆస్పత్రి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాను 40శాతం కంటిచూపు లోపంతో బాధపడుతున్నానని.. అయితే ఆసుపత్రి వైద్యులు నివేదిక సమర్పించడం లేదని.. మురళీధర్ హైకోర్టును ఆశ్రయించారు. రెండు నెలల్లోగా బాధితుడికి పరీక్షలు చేసి నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను న్యాయస్థానం ఆదేశించి.. దాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌కు స్పష్టం చేసింది.
రెండు నెలలు దాటినప్పటికీ... సరోజిని ఆస్పత్రి వైద్యులు పరీక్షించి నివేదిక ఇవ్వలేదు దీనితో మురళీధర్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. కలెక్టర్ రోనాల్డ్ రాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్ గౌడ్‌పై కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. అధికారులు వెనక్కి తగ్గి మురళీధర్‌కు మహబూబ్‌నగర్ జిల్లా పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి: ప్రభుత్వానికి ఆస్పత్రులకు మధ్య లెక్కల్లో చిక్కు!