మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం దుబ్బగూడెంలో ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 414 తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు.
గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసిన దుబ్బగూడెం గ్రామానికి చెందిన బండి సుధాకర్, కల్తీ సమ్మయ్య, పోలేబొయిన సారయ్యలు... ఛత్తీస్గడ్ నుంచి మావోయిస్టు అగ్రనేతలు వచ్చినప్పుడు వారిని కలిశారు. వారికి కావాలసిన కిరాణా వస్తువులను సమకూర్చారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా దుశ్చర్యలకు పాల్పడేందుకు సమావేశమైనట్లు విశ్వసనీయవర్గాల ద్వారా సమాచారం వచ్చింది. అప్రమత్తమైన బలగాలు ఆ గ్రామానికి వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాయి. వారిచ్చిన సమాచారంతో రామారం-పూనుగొండ్ల రహదారి మధ్యన డంపులోని మూడు సంచుల్లో దాచిపెట్టిన 414 తూటాలను స్వాధీనం చేసుకున్నాం.
-ఎస్పీ కోటిరెడ్డి
తెలంగాణలో మావోయిస్టుల ఆటలు సాగవని ఎస్పీ తెలిపారు. మావోయిస్టు అగ్రనేతల వివరాలతో ప్రతి గ్రామంలో పోస్టర్లు అతికించామన్నారు. వీరి ఆచూకీ తెలిపినవారికి తగిన బహుమతి అందిస్తామని ప్రకటించారు.