మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. తాళం వేసి ఉన్న ఇంట్లో నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన చెన్నూరి మహేష్ అనే వ్యక్తి ఓ ఎరువుల దుకాణంలో పని చేస్తున్నారు. వీరి సొంతూరు ఎల్లంపేట గ్రామం. ఇటీవల మహేష్ తండ్రి మృతి చెందడం వల్ల కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళం వేసి ఎల్లంపేటకు వెళ్లారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటికి వేసిన తాళం పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రూ.3 లక్షల నగదు, నాలుగు బంగారు ఉంగరాలు, లాప్‌ట్యాప్‌తో పాటు వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు.
ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు ఎలాంటి ఆనవాళ్లు లభించకుండా ఇంటి నిండా పసుపు, కారం చల్లి వెళ్లారు. ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇంటికి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చోరీ జరిగిన ఇంటిని సీఐ కరుణాకర్ పరిశీలించారు. క్లూస్‌టీం ఇంటిని పరిశీలించి ఇంటి నిండా పసుపు, కారం చల్లి ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఇంటర్ ఫెయిలైందని విద్యార్థిని ఆత్మహత్య