కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని అమలు చేయలేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గిరిజన యునివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం 350 ఎకరాల భూమిని ఇచ్చినా.. దాని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని మంత్రి ఆరోపించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. సింగరేణి, ఇతర సంస్థల సహకారంతో బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశాం: పల్లా
2014 ముందు తెలంగాణ ఎలా ఉందో, గడిచిన 7 ఏళ్లలో ఎలా ఉందో ప్రజలు బేరీజు వేసుకోవాలని రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వం వివిధ శాఖల్లో లక్షకు పైగా ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేసిందని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ శాఖల్లో పదోన్నతి ప్రక్రియపై సీఎం కేసీఆర్ ఆరా