రెండు, మూడేళ్లక్రితం అక్కడక్కడ మాత్రమే చెట్లు కన్పించేవి. ఇప్పుడు కనుచూపు మేరంతా పచ్చదనమే. అది మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చాప్లా తండా..రెండేళ్లక్రితం పంచాయతీగా ఏర్పడ్డ ఈ తండా రూపురేఖల్ని సర్పంచి బానోతు పాండూనాయక్, పంచాయతీ కార్యదర్శి సంపత్ ప్రజాభాగస్వామ్యంతో మార్చేశారు. యువత ముందుండి మొక్కలు నాటింది. సంరక్షణకు 400 ట్రీగార్డులను వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న గ్రామస్థులు సమకూర్చగా, మరికొన్నింటికి సర్పంచి సొంత డబ్బులిచ్చారు. గ్రామస్థుల శ్రమదానం తోడైంది. మొక్క, ట్రీగార్డు దెబ్బతింటే అదేరోజు పునరుద్ధరిస్తున్నారు.
దోమల బాధపోయింది
ప్రధాన రహదారికి ఇరువైపులా దుమ్ము, ధూళిని పీల్చుకోవడంతో పాటు నీడనిచ్చే క్రోనోకార్పస్ మొక్కలు నాటారు. ఇళ్లలో మందారం, జామ, దానిమ్మ మొక్కలు పెంచుతున్నారు. అబ్బురపడిన జిల్లా కలెక్టర్ గ్రామస్థులకు ప్రత్యేకంగా కృష్ణ తులసి మొక్కలు పంపించారు. 371 ఇళ్లున్న తండాలో గతేడాది 2,310 మొక్కలు నాటితే 1,400 ట్రీగార్డులు పెట్టారు. మిగిలినవాటికి ముళ్లకంచెలను రక్షణగా ఉంచారు. వీటితో దోమల బాధ పోయిందని తండావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ తండాను చూసేందుకు జిల్లాలోని గ్రామాల నుంచి సర్పంచులు, గ్రామ కార్యదర్శులు వస్తున్నారు.
ఇంటి ముందు మొక్క.. ట్రీగార్డుపై యజమాని పేరు
వంద శాతం మొక్కల్ని సంరక్షించిన గ్రామంగా పేరొందింది..యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం పోతిరెడ్డిపల్లి. గ్రామంలో 300 ఇళ్లు. ప్రతి ఇంటి ముందు వేప, కానుగ, అల్లనేరేడు మొక్కల్ని నాటారు. ట్రీ గార్డుపై ఇంటి యజమాని పేరుతో ‘ఇది నా మొక్క.. మొక్కల సంరక్షణ అందరి బాధ్యత’ అని బోర్డుపెట్టి ప్రజలకు అప్పగించారు. దీంతో గతేడాది నాటిన నాలుగువేల మొక్కలూ బతికాయి. సర్పంచి గనగాని మాధవి సొంత డబ్బుతో వెయ్యి, పంచాయతీ నిధులతో వంద ట్రీగార్డులు పెట్టించారు. ఇంటింటికి జామ, నందివర్ధనం, తులసి, గోరింటాకు, ఉసిరి, మందారం, గన్నేరు, మామిడి వంటి ఆరు రకాల పూల, పండ్ల మొక్కలిచ్చారు. ఊరిలో వీధులు.. కొరటికల్, పారుపల్లికి వెళ్లే దారులకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సంవత్సరం రెండు వేలు నాటారు.
మరియపురం..హరిత వనం
జనాభా ఎనిమిది వందలున్న ఆ పల్లెలో ఇప్పటికే నాటిన మొక్కల సంఖ్య 16వేల పైమాటే. విశాల రహదారులతో, ప్రతి వీధి పచ్చదనం పరిచినట్లు కన్పించే ఆ గ్రామం వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం. ఈ పచ్చ‘ధనం’ వెనుక ఆ ఊరి ‘సిరి’మంతుడు, ప్రస్తుత సర్పంచి బాల్‌రెడ్డి ప్రత్యేక చొరవ ఉంది. సర్పంచి కాకముందే నుంచే ఊరిలో వేల మొక్కలు నాటించారు. మొక్క నాటడం, సంరక్షణలో 80 శాతం భాగస్వామ్యం గ్రామంలోని 18 మహిళా స్వయం సహాయక సంఘాలదే. ఊరిలో కోతుల బెడద తప్పించేందుకు మంకీ ఫుడ్ కోర్టులో 426 పండ్లమొక్కలు నాటారు. మరో నాలుగొందలు నాటాలన్నది లక్ష్యం.
సొంత డబ్బులతో
మొక్కలకు నీళ్లు పోసేందుకు బాల్‌రెడ్డి సొంత డబ్బుతో ట్రాక్టర్ కొనిచ్చారు. ట్రీగార్డులు ఏర్పాటు చేయించారు. డ్రైవరు, నీరు పోసే వ్యక్తితోపాటు, సూపర్‌వైజర్‌ను నియమించి.. వారి వేతనాన్ని భరిస్తున్నారు. రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కల్ని ఊరిలో ఒక్కో కుటుంబం దత్తత తీసుకుని సంరక్షిస్తోంది. నాటిన మొక్కలకు ఏటా కేక్ కోసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. మంకీ ఫుడ్‌కోర్టుకు ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేటుభూమి ఎకరం కొనుగోలుచేశారు. దాదాపు నాటిన మొక్కలన్నీ బతికాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మరియపురం గురించి ప్రస్తావించారు.
పదేళ్లలో 2.89 లక్షల మొక్కలు
చిప్పలపల్లి.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఈ గ్రామంలో ఎటుచూసిన పచ్చదనమే కనిపిస్తుంది. తెలంగాణలో హరితహారం 2015 నుంచి మొదలైనా ఆ స్ఫూర్తి అంతకు ఆరేళ్ల ముందే ఆ పల్లెలో ప్రారంభమైంది. 2009-2019 వరకు గ్రామంలో, పక్కన అటవీప్రాంతంలో 2.89 లక్షల మొక్కలు నాటారు. 2018లో ఈ గ్రామానికి హరితమిత్ర అవార్డు వచ్చింది. అటవీశాఖ ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని మొక్కలకు నీళ్లు పోసేందుకు ట్రాక్టర్ ఇచ్చింది. మొక్కను తొలగించినా, చెట్టును నరికినా రూ.500 జరిమానా అంటూ 2010లోనే ఈ గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. సర్పంచ్, వార్డుసభ్యులు.. కొంతకొంత ప్రాంతాన్ని దత్తత తీసుకుని, యువకుల్ని భాగస్వామ్యం చేస్తూ మొక్కలను సంరక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశ.. అప్రమత్తంగా ఉండాలి'