బస్సు టైరు పంక్చరైతే డ్రైవర్‌కు శిక్ష వేసిన ఘటన మహబూబాబాద్ డిపోలో చోటుచేసుకుంది. డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ సాధిక్ ఈ నెల 18న రాత్రి విధులకు వెళ్లగా... బస్టైరు పంక్చరైంది. మరమ్మతులు చేరుకున్న సాధిక్... విధులు ముగిసిన అనంతరం డిపోలో బస్సు పెట్టి విషయాన్ని లాక్షీట్లో రాశాడు. మరుసటి రోజు వారంతరం సెలవు కావటం వల్ల 21న డ్యూటీ ఛార్ట్ చూడటానికి వెళ్ళిన డ్రైవర్ సాధిక్ తో పాటు ఇతర తోటి కార్మికులకు బయట గేటు వద్ద కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
టైరుపై పేరు, ఐడీ రాసి ప్రదర్శన
డిపో గేటు వద్ద పంక్చర్ అయిన టైరుపై ఎండీ.సాధిక్ పేరు, ఐడీ నెంబర్ రాసి ప్రదర్శనకు పెట్టారు. విధుల్లోనూ... డ్రైవర్‌గా కాకుండా డిపో స్పేర్‌గా మార్చారు. డిపోస్పేర్ అంటే బస్టాపుల్లో ఉంటూ... ప్రయాణికులను బస్సుల్లో ఎక్కించే విధి. పరోక్షంగా ఇది మిగతా డ్రైవర్లకు హెచ్చరికలా ఈ విధంగా చేసినట్లు తేలిపోయింది.
మనోవేదనలో డ్రైవర్...
బస్సు టైరు పంక్చర్ అయితే ఇంత శిక్ష ఎప్పుడూ లేదని... ఆర్టీసీ చరిత్రలోనే ఇదే ప్రథమమని కార్మికులు వాపోతున్నారు. మహబూబాబాద్ డిపోలో చాలాకాలంగా పనిచేస్తూ... మంచి పేరు తెచ్చుకున్న సాధిక్‌కు ఇలా చేయటం బాధకరమన్నారు. ఈ చర్యతో తను మనోవేదనకు గురయ్యానంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై మాట్లాడేందుకు బస్ డిపో మేనేజర్ మహేష్ నిరాకరించారు.