రాష్ట్రంలో ఉన్న అధికారమంతా కొద్ది మంది కాంట్రాక్టర్లకే ఉపయోగపడుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఖమ్మం... వరంగల్... నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గార్ల , మహబూబాబాద్‌లలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు.
ప్రజల నిధుల్లో కోత విధిస్తూ.. కాంట్రాక్టర్లు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతున్నారని ఆయన ఆరోపించారు. వాళ్ల స్థాయిని పెంచుకోగలిగారు కానీ.. ప్రజల సమస్యలు మాత్రం యథావిధిగా పెండింగ్‌లోనే ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రంలో 30 శాతం మంది నిరుద్యోగులు ఉన్నా కూడా.. ప్రభుత్వానికి ఉద్యోగాల కల్పనపై దృష్టి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లక్షా 60 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల వెట్టి కార్మికులుగా పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
"కేసీఆర్ సీఎం కుర్చీ దిగుతారని నేను అనుకోవడం లేదు. కాని అనివార్య కారణాలతో కుర్చీ దిగితే.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన వారిని లేదా బలహీన వర్గాలకు చెందిన వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నా. రిజర్వేషన్లపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లంతా మొదటి ప్రాధాన్యతగా.. ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా".
--ప్రొఫెసర్ కోదండరామ్
విధుల్లోంచి తీసేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు.. అధికార పార్టీ నాయకుల కాళ్ల మీద పడాల్సిన దుస్థితి ఏర్పడిందని కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు పీఆర్సీ అమలు చేసినా ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి కానీ... ఈసారి పీఆర్సీలో ఉద్యోగుల జీతాల తగ్గాయని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో టీజేఎస్ నేతలు డోలి సత్యనారాయణ, పిల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: భార్యను మర్డర్ చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించి..