మహబూబాబాద్ జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డిలు అమరవీరుల స్తూపం ముందు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్మృతి పరేడ్‌లో కలెక్టర్ పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. భారత్ చైనా సరిహద్దులోని లద్దాఖ్‌లోని అక్సాయ్ చిన్ వద్ద, కేంద్ర రిజర్వు పోలీసు దళం సరిహద్దులో వీరోచితంగా పోరాడారని ఎస్పీ కోటిరెడ్డి గుర్తు చేశారు.
1959 అక్టోబరు 21న విపరీతమైన చలిలో పది మంది సీఆర్పీఎఫ్ పోలీసులు విధులు నిర్వహిస్తుండగా... చైనాకు చెందిన సైనికులు భారీ సంఖ్యలో మన దేశ సరిహద్దులోకి చొచ్చుకు వచ్చారని ఎస్పీ తెలిపారు. వారిని ఈ పది మంది పోలీసులు ధైర్యముతో ఎదిరించి, చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి, దేశం కోసం అమరులు అయ్యారని అన్నారు. దేశ రక్షణ కోసం పోలీసులు ప్రాణాలు వదిలిన తొలి ఘటన అదేనని పేర్కొన్నారు.
"ఉన్నతాధికారులు 1960 జనవరి 9న సమావేశమై అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకోవాలని నిర్ణయించారు. నాటి నుంచి నేటి వరకు దేశ వ్యాప్తంగా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. అమర పోలీసుల త్యాగాన్ని స్మరించుకుని, వారి కుటుంబాలకు సానుభూతి, సహకారాన్ని ప్రకటించి, వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నారు. రాష్ట్ర ప్రజల భద్రతలో విధులు నిర్వర్తిస్తున్న 326 తెలంగాణకు చెందిన పోలీసులు మావోయిస్టు, ఇతర నక్సలైట్ల చేతుల్లో అమరులయ్యారు. పోరాడుతూ అసువులు బాసిన ఈ 326 మంది అమర పోలీసులకు తెలంగాణ యావత్తు నివాళులు అర్పిస్తోంది."
- కోటిరెడ్డి, ఎస్పీ
ఇదీ చదవండి: పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి: సజ్జనార్