మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెంలో ప్లాస్టిక్ బియ్యం గుట్టు రట్టయింది. దీనిపై ప్రశ్నించిన గ్రామస్థులకు.. సదరు దుకాణ యాజమాని నుంచి నిర్లక్ష్యపు సమాధానమే వచ్చింది.
గ్రామానికి చెందిన ఓ కిరాణా దుకాణంలో మూడు రోజుల క్రితం అలకుంట్ల సైదులు 25 కిలోల బియ్యం కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకెళ్లి వండి.. భోజనం చేశారు. ఆ రోజంతా ఆకలి వేయలేదని.. అనుమానంతో తర్వాత రోజు అదే బియ్యంతో వంట చేసినట్లు సైదులు తెలిపారు. ఎంత ఉడికించినా సరిగా ఉడకకపోవడం వల్ల దానికి ఓ ముద్దగా చేసి నేలపై కొట్టాడు. బంతి మాదిరిగా పైకి లేచిందని సైదులు వివరించారు. ఊరిలో పండించిన బియ్యం తెచ్చి వంట చేశామని.. కొద్ది సేపటికే ఉడికిందని తెలిపారు.
రెండింటిలో తేడాను గమనించిన సైదులు.. బియ్యం విక్రయించిన దుకాణం యజమానిని నిలదీశాడు. అతని నుంచి నిర్లక్ష్యపు సమాధానమే ఎదురైంది. గ్రామాల్లోకి ప్లాస్టిక్ బియ్యం రావడంపై ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న దుకాణ యాజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీచూడండి: ప్రజల ఆరోగ్యాలను ప్రభుత్వం గాలికొదిలేసింది: భట్టి