మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూరుగుపాడులోని అంగన్వాడీ కేంద్రంలో నాలుగేళ్ల చిన్నారి చేతిపై గరిటతో వాత పెట్టిన ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తీవ్రంగా స్పందించారు. చిన్నారి చేతిపై కర్కశంగా గరిటతో వాత పెట్టిన అంగన్వాడీ టీచర్ హైమవతిని వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అంగన్వాడీలకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నతాధికారులకు సూచించారు. గాయపడిన చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.
అంగన్వాడీకి రావట్లేదని..
బూరుగుపాడుకు చెందిన రాయబారపు రమేష్, కుమారిల కుమార్తె రెండు రోజుల నుంచి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లడం లేదు. దీంతో.. కేంద్రంలో గుడ్లు తీసుకువద్దామని నచ్చజెప్పి నానమ్మ, తల్లి కలిసి పాపను అంగన్వాడీకి వెళ్లారు. ఆ సమయంలో అంగన్‌వాడీ కార్యకర్త.. కులం పేరుతో దూషించడమే కాకుండా చిన్నారిని లోపలికి లాక్కెళ్లి కుడిచేతిపై గరిటతో వాతలు పెట్టింది. ఈ మేరకు చిన్నారి తల్లిదండ్రులు డోర్నకల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అంగన్‌వాడీ టీచర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై అంగన్‌వాడీ టీచర్ హైమావతిని వివరణ కోరగా.. తాను అసలు చిన్నారిపై ఎలాంటి చేయి చేసుకోలేదని, జరిగిన సంఘటనతో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తెలిపారు.
సంబంధిత కథనం..