ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బంగారుగూడెంలో నిర్వహించిన హరితహారంలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి... గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
మొక్కనాటి.. సంరక్షించాలి...
"తరిగిపోయిన వృక్ష సంపదను తిరిగి పెంచుకునేందుకు అందరూ మొక్కలు నాటాలి. అక్కడితో పని అయిపోయింది అనుకోకుండా.. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి. పల్లెలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలుపరుస్తోంది."
- సత్యవతి రాఠోడ్, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి
ఓదార్చుతూనే భావోద్వేగం...
అనంతరం అదే గ్రామానికి చెందిన జైపాల్, ఝాన్సీ దంపతులు... కొవిడ్ బారిన పడి ఇటీవలే మృతి చెందగా.. వారి కుటుంబాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్ పరామర్శించారు. దంపతులు ఇద్దరిని కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకున్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న కుటుంబసభ్యుల ఆవేదనను చూసి తట్టుకోలేకపోయిన మంత్రి సత్యవతి రాఠోడ్... భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబసభ్యులను ఓదార్చుతూ.. తాను కూడా కంటతడి పెట్టారు. కాసేపటికి.. దుఃఖాన్ని నియంత్రించుకుని బాధిత కుటుంబ సభ్యులకు... ధైర్యం చెప్పారు.