రైతులు ఒకే పంటను సాగు చేసి నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి ఆర్థికంగా లబ్ది పొందాలని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రతిమడుగులో వానాకాలం-2020 నియంత్రిత పంటల సాగుపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు. ఆరుగాలం శ్రమిస్తూ దేశానికి అన్నం పెడుతున్న రైతన్నను రాజుగా చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని అన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రాష్ట్రప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా రైతు సంక్షేమం దృష్టిలో పెట్టుకొని రైతులకు రుణమాఫీ, రైతుబంధు కోసం నిధులు విడుదల చేసిందన్నారు. అధికారులు సూచించిన పంటలు సాగు చేస్తే కనీస గిట్టుబాటు ధర అందుతుందన్నారు.రోహిణీ కార్తెలో వరి నారు పోస్తే మంచి దిగుబడులు వస్తాయని చెప్పారు. అధికారులు రైతులకు సన్నరకాల వరి సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. దేశంలో తెలంగాణలో పండించే పత్తికి మంచి డిమాండ్ ఉందన్నారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని సకాలంలో రైతులకు అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి: వన్యప్రాణుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి