ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కోతలు లేకుండా చూస్తామని, రైతుకు నష్టం చేసే పనులు ఎవరు చేసినా ఉపేక్షించేదిలేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవరి రాఠోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచర్లలో డీఎంసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
కొనుగోలు చేసిన బస్తాల తరలింపులో జాప్యం జరిగితే సమీప పాఠశాలల్లో నిల్వ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి తెలిపారు. రైతులకు వారం రోజుల్లో బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ధాన్యం, మక్కలు, కంది, శనగ పంటలను రైతులు దళారులకు విక్రయించి నష్టపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్ బిందు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి