దశాబ్దకాలంగా వివాదాస్పదంగా మారిన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌యూబీ నిర్మాణ సవరణ పనులకు ఎట్టకేలకు సర్వే ప్రారంభమైంది. విజయవాడ-కాజీపేట రైల్వే జంక్షన్ మార్గంలో మహబూబాబాద్‌లోని రైల్వేలైన్ ఎల్‌సీ నెంబరు 81 వద్ద ఆర్‌యూబీ నిర్మాణం చేశారు. పాత బజార్, కొత్త బజార్‌ను కలుపుతూ చేసిన ఈ నిర్మాణంలో సాంకేతిక లోపాలున్నాయని వాహనాల రాకపోకలకు అనువుగా లేవని స్థానికులు, ప్రజాప్రతినిధులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
ఆర్‌యూబీ నుంచి బయటకు వెళ్లే అయిదు మార్గాలు సొరంగమార్గంలా మారాయని.. ఇరువైపులా గోడలు నిర్మించడం వల్ల దుకాణాలు, ఇళ్లకు సరైన మార్గం లేదని రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆర్‌యూబీ నమూనాలో మార్పులు చేస్తూ రూ.2.50కోట్లు మంజూరు చేయించారు. ఈ మేరకు పనులను చేపట్టేందుకు రహదారులు, భవనాల శాఖ అధికారుల ఆధ్వర్యంలో తాజాగా సర్వే చేస్తున్నారు. పొడవును తగ్గిస్తూ స్లోపును పెంచేలా ఆర్‌యూబీ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
ఇదీ చూడండి : వలస విషాదం: 100కి.మీ నడిచి ప్రసవం- బిడ్డ మృతి