నేర రహిత సమాజ నిర్మాణానికి సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కొన్నారు. డోర్నకల్ మండలంలోని 20 గ్రామాల్లో అమర్చిన 266 నిఘా నేత్రాలను పోలీసుస్టేషన్ నుంచి ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులను ఆయన సత్కరించారు.
జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చొరవ చూపిన సీఐ శ్రీనివాస్‌ను ఎస్పీ అభినందించారు. మనదేశంలో రక్షణ ఉండదనే భయంతో బయటకు వెళితే ఎవరో ఒకరు తోడుగా వస్తుంటారని.. అదే న్యూయార్క్‌లోనైతే ఒక మనిషి బయటకు వెళితే ఇంటికి వచ్చేలోపు 10 సీసీ కెమెరాలలో నమోదవుతారన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఏడాదికి 500 చైన్ స్నాచింగ్ కేసులు నమోదైతే ఇప్పుడు 5-10 మాత్రమే జరుగుతున్నాయంటే నిఘా నేత్రాల పనితీరే కారణమన్నారు.
సీసీ కెమెరాల ఆధారంగా మహిళలను వేధింపులకు గురి చేస్తున్న 600 మందిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. డోర్నకల్ మండలంలో మరో తొమ్మిది గ్రామాల్లో నిఘా నేత్రాలు అమర్చితే వంద శాతం పూర్తయిన మండలంగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందుతుందన్నారు. పోలీసుల అవసరం లేకుండా ఎన్నికలు జరిగే రోజు రావాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ యోగేశ్ గౌతమ్, డీఎస్పీ వెంకటరమణ, స్థానికి ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు ఎలా వేయాలో తెలుసా...?