వ్యవసాయేతర ఆస్తుల లెక్కింపు సర్వేను వేగవంతం చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నర్సింహులపేట మండలం పెద్దనాగారం, ముంగిమడుగు, నర్సింహులపేట గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రగతి పనులను పరిశీలించారు. వాటి పురోగతులను అడిగి తెలుసుకున్నారు.
ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. సర్వే నిర్వహణ తీరును కలెక్టర్ పర్యవేక్షించారు. ఇళ్ల ఆస్తుల లెక్కింపు ప్రక్రియలో అలసత్వం వహిస్తున్న ముంగిమడుగు పంచాయతీ కార్యదర్శి సాగర్, నర్సింహులపేట పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవోను కలెక్టర్ ఆదేశించారు.
పల్లె ప్రగతి పనులు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వ్యవసాయేతర ఆస్తుల లెక్కింపు కార్యక్రమాన్ని పారదర్శకంగా చేపట్టాలని కోరారు.