మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడలో ఇద్దరు పిల్లల దీనస్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం(Response to Etv Bharat Story) అయ్యో బిడ్డలారా.. ఎంత కష్టం! చూడలేరు.. నడవలేరు.. మాట్లాడలేరు.. పట్ల ఆ జిల్లా కలెక్టర్ శశాంక స్పందించారు. అంధత్వం, నడవలేక, నిలబడలేక 'లెబర్స్ కాన్‌జెనిటల్ అమారోసిస్' అనే వింత వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు సోదరులు... వారిని సాకేందుకు తల్లిదండ్రుల కష్టాలపై నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
అధికారుల భరోసా
కలెక్టర్ ఆదేశాలతో బాలల సంరక్ష భవన్ సమన్వయకర్త జ్యోతి తన బృందంతో బాధిత కుటుంబాన్ని కలిసి చరణ్, శరత్ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఐసీడీఎస్ డోర్నకల్ బాలల అభివృద్ధి అధికారి ఎల్లమ్మ బాధిత కుటుంబాన్ని కలిసి పిల్లల పరిస్థితిని పరిశీలించారు. తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయంగా 25 కిలోల బియ్యం, నిత్యావసర సరకులను అందించారు. ఇద్దరికి అందాల్సిన దివ్యాంగుల పింఛన్ రాష్ట్ర స్థాయిలో పెండింగ్‌లో ఉండటంతో రాలేదని... ఆధార్ కార్డులో పేరు సరిచేసి పింఛను వచ్చేలా చేస్తామన్నారు. పిల్లల వైద్యం కోసం స్పాన్సర్‌షిప్ ద్వారా నెలకు రూ.2 వేల చొప్పున అందించనున్నట్లు హామీ ఇచ్చారు. ఉన్నత వైద్య సదుపాయం కల్పిస్తామన్నారు. పింఛన్ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. బాధిత కుటుంబాన్ని కలిసిన వారిలో డోర్నకల్ ప్రాజెక్టు అభివృద్ధి అధికారి ఎల్లమ్మ, బాలల సంరక్షణ అధికారి నరేశ్, సర్పంచి గుండోజు శ్రీనివాసాచారి, ఉప సర్పంచి హేమంత్, అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారు.
పిల్లల దీనగాథ
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు బాలుర హృదయ విదారక గాథ ఇది. ఇటికాల సంధ్య, వెంకన్న దంపతులు కూలి పనులు చేసి జీవిస్తుంటారు. వీరి పెద్ద కుమారుడు చరణ్(11) ఆరేళ్ల వరకు అందరిలా పాఠశాలకు వెళ్లి బాగా చదువుకుంటుండేవాడు. ఏడేళ్ల వయస్సులో ఉన్నట్లుండి కంటిచూపు కోల్పోయాడు. ఎన్నో ఆసుపత్రులు తిరిగిన వీరు హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు..అక్కడి వైద్యులు దీన్ని ‘లెబర్స్ కాన్‌జెనిటల్ అమారోసిస్’గా తేల్చి పిల్లవాడికి 100 శాతం అంధత్వం వచ్చిందని చెప్పారు. చూస్తుండగానే చరణ్ నడవలేని, మాట్లాడలేని స్థితికి వచ్చి ఇంట్లోనే అచేతనంగా ఉంటున్నాడు. కొడుకు దీనావస్థను చూసి కుమిలిపోతున్న పేద దంపతులపై మరోసారి పిడుగు పడింది. చిన్న కుమారుడు శరత్ (9) సైతం ఏడేళ్ల వయస్సు వచ్చేటప్పటికి అన్న చరణ్‌లా అయిపోయాడు. మేనరికం ప్రభావంతో ఇలాంటి అరుదైన వ్యాధులు వస్తుంటాయని వైద్యులు అభిప్రాయపడినట్లు వారు చెప్పారు. సెంటు భూమి కూడా లేని వీరు ఇప్పటికే ఇద్దరి వైద్యం కోసం అప్పులు చేసి చితికిపోయారు.
గ్రామస్థుల విజ్ఞప్తి
దివ్యాంగులకు ఇచ్చే పింఛను అయినా తన కుమారులకు ఇవ్వాలని తండ్రి వెంకన్న అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఒక్క అధికారి కూడా స్పందించలేదు (Parents seeking donor for the treatment of children). ఇప్పటికైనా ప్రభుత్వం, దాతలు స్పందించి తమ కుమారులకు పింఛన్ ఇవ్వాలని వేడుకుంటున్నారు. అరుదైన వ్యాధితో అష్టకష్టాలు పడుతున్న బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్థులు విఙ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: అయ్యో బిడ్డలారా.. ఎంత కష్టం! చూడలేరు.. నడవలేరు.. మాట్లాడలేరు..