"బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని"... ఈ మధ్య చాలా వైరల్ అవుతున్న పాట ఇది. మొన్నటికి మొన్న నూతన వధువు(Bullet Bandi Song: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీ అయిన వధువు.. వరుడికి అదిరిపోయే పెళ్లి కానుక), నిన్న ఓ నర్సు (Bullet Bandi song : బుల్లెట్ బండి పాటకు నర్సు స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా!)... ఆ తర్వాత ఓ పంజాబీ వృద్ధురాలు ఈ పాటకు డ్యాన్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యారు. తాజాగా ఓ కొండంగ పిల్ల... ఈ పాట పెడితేనే పాలు తాగుతోంది. ఏంటీ అనుకుంటున్నారా..! నిజమండి. కావాలంటే మీరే చూడండి.
మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో వానరాల బాధను తప్పించుకునేందుకు ఓ కిరాణా దుకాణం యజమాని కొండెంగను తెచ్చి పెంచుకున్నాడు. ఇటీవలే ఆ కొండెంగ మరో చిన్న కొండెంగకు జన్మనిచ్చింది. దాన్ని కూడా యజమాని ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ వారంవారం రోజుల క్రితం తల్లి కొండెంగ మరణించింది. తల్లి చనిపోవడంతో చిన్న కొండెంగ పాలు తాగడం మానేసింది. యజమాని ఎంత ప్రేమగా దగ్గరకు తీసికొని పాలు పట్టిస్తున్నా అది తాగడం లేదు. ఇలాగే రెండు మూడు రోజులు గడిసిపోయింది. కొండెంగ పిల్ల రోజురోజుకీ బక్కచిక్కిపోయింది.
ఓ చేతిలో సెల్‌ఫోన్.. మరో చేతిలో పాల డబ్బా..
అదే సమయంలో ఇరుగుపొరుగు పిల్లలంతా సెల్ఫోన్లో "బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని" అనే పాట వింటున్నారు. అక్కడే పడుకున్న కొండెంగ పిల్ల ఈ పాట విని పిల్లల దగ్గరకు వెళ్లింది. ఫోన్‌ని లాక్కొని పాట వినడాన్ని యజమాని గమనించాడు. కొండెంగ పిల్ల అలాగే చూస్తూ నవ్వు మొహం పెట్టడంతో.. పాల డబ్బా తీసుకొచ్చి పాలు పట్టే ప్రయత్నం చేశాడు. అప్పటివరకు చుక్క పాలు తాగని కొండెంగ పిల్ల పాట వింటూ తాగడం ప్రారంభించింది.
అప్పటి నుంచి ప్రతిరోజూ బుల్లెట్టు బండి పాట పెడ్తేనే పాలు తాగుతోంది. సంగీతానికి రాళ్ళు కరుగుతాయంటారు... అది నిజమో కాదో తెలీదు కాని మనసులో ఉన్న బాధ మాత్రం పోతుందనడానికి కొండెంగ పిల్లే ఓ నిదర్శనం.
ఇదీ చూడండి:Bullet Bandi Song: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీ అయిన వధువు.. వరుడికి అదిరిపోయే పెళ్లి కానుక
ఇదీ చూడండి:Bullet Bandi song : బుల్లెట్ బండి పాటకు నర్సు స్టెప్పులు.. నెటిజన్లు ఫిదా!