మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీసలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో తాజాగా వెలుగుచూసిన రాతి శాసనం, దేవాలయ భూదానపత్రిక తామ్ర శాసనంలో దేవుడి ఉత్సవాలకు, కల్యాణానికి కట్నాలు చెల్లించేవారని బహిర్గతమైందని తెలంగాణ జాగృతి చరిత్ర బృందం ప్రతినిధి, పురాతత్వ పరిశోధకుడు రామోజు హరగోపాల్ వెల్లడించారు. కవి, చరిత్రకారుడు కట్టా శ్రీనివాస్ ఇటీవల ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ విశేషాలు వెలుగుచూశాయని చెప్పారు.
‘సమీపంలోని ఓ ఊరిలో ఉన్న సీతారామచంద్రస్వామి విగ్రహాల్ని మన్నెగూడెం తెచ్చాక కొన్నాళ్లు కైంకర్యాలు తప్పాయి. దీంతో కొందరు ఆలయం నిర్మాణానికి భూదానం చేసి విగ్రహాల్ని సంకీసకు రప్పించి ప్రతిష్ఠించారు. భూదాన పత్రం శిథిలం కావడంతో రాగి రేకుపై ఈ విషయాలు రాయించారు’ అని హరగోపాల్ వివరించారు. సీతారామచంద్రస్వామి కల్యాణంలో 30 గ్రామాల ప్రజలు పాల్గొనేవారని.. తమ ఇళ్లలో వివాహాలు జరిగితే ఆడపెళ్లివారు అర్ధ రూపాయి, మగపెళ్లివారు రూపాయి వంతున దేవుడికి కట్నమిచ్చేవారని ఆయన బుధవారం పేర్కొన్నారు.