మహబూబాబాద్ జిల్లా దంతాపల్లి మండలానికి చెందిన నిరుపేద మహిళకు మొదటి సంతానంలో ఆడ శిశువు జన్మించగా.. జనవరి 29న జిల్లా ఆసుపత్రిలో రెండో సంతానంలోనూ ఇద్దరు ఆడ శిశువులు జన్మించారు. పోషించే ఆర్థిక స్థోమత లేకపోవటం వల్ల ఆసుపత్రి సిబ్బంది సహకారంతో కురవికి చెందిన దంపతులకు ఒక శిశువును, కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన దంపతులకు మరో శిశువును అక్రమంగా దత్తత ఇచ్చారు.
ఆలస్యంగా సమాచారం తెలిసిన వెంటనే జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులు శిశువులను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేశారు. దత్తత తీసుకోవాలనుకునేవారు తమని సంప్రదించాలని.. అక్రమ దత్తత చట్టవిరుద్ధమని జిల్లా సంక్షేమాధికారి సంధ్యారాణి తెలిపారు. బాల రక్షా భవన్ సమన్వయకర్త జ్యోతి, బాలల సంరక్షణ అధికారులు పి.కమలాకర్, వీరన్న, నరేశ్, సామాజిక కార్యకర్త వెంకన్న, అంగన్‌వాడీ టీచర్, ఛైల్డ్‌లైన్ సిబ్బందిని ఆమె అభినందించారు.