మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గవ్యాప్తంగా గత రెండ్రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు డోర్నకల్‌లోని మున్నేరు, దంతాలపల్లి మండలంలోని పాలేరు వాగులు వరదనీటితో పొంగిపొర్లుతున్నాయి. వర్షపునీటితో పాటు ఎగువనుంచి వచ్చిన వరద నీరంతా పాలేరు, మున్నేరు వాగులకు పోటెత్తింది. డోర్నకల్ పెద్ద చెరువు అలుగు పోస్తోంది. ఈ వాగులపై ఉన్న చెక్‌డ్యాంలు పూర్తిస్థాయిలో నిండి జలకళను సంతరించుకున్నాయి. పలు మండలాల్లోని చెరువులు కూడా మత్తళ్లు పోస్తూ నిండుకుండల్లా మారాయి.
సమృద్దిగా వర్షాలు కురుస్తుండటం వల్ల వానాకాలం పంటల సాగుకు ఇక ఢోకా లేదని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి కురవి మండలం తాట్యాతండాలో జాటోతు రవీందర్ అనే రైతుకు చెందిన పశువుల కొట్టం కూలిపోయింది. పశువుల కొట్టంలో ఉన్న రూ.50 వేల విలువ చేసే కాడెద్దు మృతి చెందింది. ఎద్దు మృతితో రైతు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇవీ చూడండి: నేడు తేలికపాటి వర్షాలు.. రేపు, ఎల్లుండి భారీ వర్షం