బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత నాలుగు రోజులుగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగులు పోస్తున్నాయి.
మున్నేరు, ఆకేరు, పాలేరు, పాకాల, వట్టి, బంధం వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గుడూరు మండల కేంద్రంతో నర్సంపేట, కేసముధ్రం, నెక్కొండ, గార్ల నుంచి రాంపురం, మద్దివంచ మద్య రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ నుంచి ఇల్లందు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పాకాల వాగు సమీపంలో వ్యవసాయ శాఖ 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాంలో సీసీఐ.. పత్తి బేల్లను నిల్వచేసింది. ఈ గోదాం ఆవరణ వరకూ వరదనీరు చేరింది. వరద ప్రవాహం తగ్గితేనే నష్టం అంచనా వేయగలమని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పోలీసులు పహారా కాస్తున్నారు.
జోరువానలకు బయ్యారం మండలం కొత్తపేట, కురవి మండలం మోదుగుల గూడెంలో రెండు ఇళ్లు కూలిపోయాయి. వేలాది ఎకరాలలో వరి పంట నీట మునిగింది. ఇతర పంటలూ పాక్షికంగా దెబ్బతిన్నాయి. వర్షాల జోరు ఇలానే కొనసాగితే చెరువు కట్టలకు గండ్లు పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.
వాగులు, చెరువు అలుగులు పోస్తున్నాయని మహబూబాబాద్ డీఎస్పీ నరేశ్‌కుమార్ తెలిపారు. ఈ ప్రాంతాల వైపు రావొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని కోరారు. మంత్రి సత్యవతి రాఠోడ్, ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద పోలీస్ పికెట్లను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
ఇవీచూడండి: వర్షాలు, వరదల పరిస్థితిపై జలవనరుల శాఖ నిరంతర పర్యవేక్షణ