నూతన పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలంటూ.. రైతులు ర్యాలీ నిర్వహించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో చోటుచేసుకుంది. భూప్రక్షాళన ప్రక్రియ అనంతరం ప్రభుత్వం అందరికీ పాసుపుస్తకాలు ఇచ్చి.. తమ గ్రామంలో మాత్రం ఎవరికీ ఇవ్వలేదని గ్రామస్థులు వాపోయారు. ఆ మేరకు రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాలు తమకు వర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి తమకు పాసుపుస్తకాలను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామంలో సుమారు 1200మంది రైతులమున్నామని వారు పేర్కొన్నారు. 1827 ఎకరాల భూమిని 1960లోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని తెలిపారు. భూప్రక్షాళన ప్రక్రియ వరకూ.. రైతుబంధు, రైతు రుణమాఫీలను పొందామని పేర్కొన్నారు. భూప్రక్షాళన కార్యక్రమంలో 1బీ కూడా ఇచ్చారని వివరించారు. అనంతరం అన్ని గ్రామాలకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చినా.. తమకు మాత్రం ఇప్పటివరకూ రాలేదన్నారు. రైతు సంక్షేమ పథకాలు తమకు వర్తించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్లో తమ ఉత్పత్తులను కొనడం లేదన్నారు. పోని.. భూములు అమ్ముకుందామంటే కొనడానికి ముందుకెవరు రావడంలేదంటూ వాపోయారు.
'అటవీశాఖ నుంచి ఫారెస్ట్ భూమి కాదంటూ.. నివేదిక వస్తేనే పాస్‌పుస్తకాలు ఇవ్వగలమని అధికారులు పేర్కొంటున్నారు. ఎన్నోసార్లు సంబధిత అధికారులను సంప్రదించాం. అయినా ఏ ఫలితం లేదు. తమ భూముల పక్కనే.. అటవీ శాఖకు చెందిన సుమారు 200ఎకరాల భూమి ఉంది. దాన్ని కాజేసేందుకు కొంతమంది నాయకులు, అధికారులతో కుమ్మక్కయ్యారు. ఆ కారణంగానే మాకు పాస్ పుస్తకాలు రాకుండా అడ్డుకుంటున్నారు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి న్యాయం చేయాలి.'
- నారాయణపురం రైతులు
ఇదీ చదవండి: పాసుపుస్తకం లేదు... రైతుబంధు రాదు!