వరి పైరు ఎండిపోవడానికి కారణమైన పురుగు మందుల దుకాణం ముందు రైతు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన వెంకన్న 2 ఎకరాల్లో వరి సాగు చేశాడు. వరికి పురుగు ఆశించగా.. మహబూబబాద్లోని ఓ షాపులో క్లోరోపైరీపాస్, సాఫ్ మందులను కొనుగోలు చేసి వరి పంటకు పిచికారీ చేశాడు.
తెల్లారి వెళ్లి చూసేసరికి వరి పైరు పూర్తిగా మాడిపోయింది. ఆందోళనకు గురైన రైతు పురుగు మందును అమ్మిన దుకాణం యజమానిని నిలదీశాడు. వ్యవసాయ అధికారి ఎండిపోయిన పంటను పరిశీలించి రైతు తప్పు లేదని తెలిపారు.
ఆ మందు పిచికారీ చేయడంవల్లే తన పంట నాశనమయిందని ఆరోపిస్తూ.. వెంకన్న న్యాయం చేయాలంటూ ఆ షాపు ఎదుట వినూత్నంగా నిరసన తెలిపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతును పోలీస్టేషన్‌కు తరలించారు.
"ముప్పై సంవత్సరాలుగా ఈ దుకాణంలో పురుగు మందులను కొనుగోలు చేస్తున్నాను. మహబూబబాద్ లోని ఎస్వా ఆగ్రిమాల్లో క్లోరోపైరీపాస్, సాఫ్ మందులను కొనుగోలు చేసి వరి పంటకు పిచికారీ చేశాను. తెల్లారి వెళ్లి చూసేసరికి వరి పైరు పూర్తిగా మాడిపోయింది. పంట ఎండి పోవడంతో రూ. లక్ష పంటను నష్టపోయాను. పరిహారం చెల్లించి నకిలీ మందులను అమ్మిన దుకాణం యాజమాని పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా".
--రైతు వెంకన్న