వ్యవసాయానికి ఉచిత కరెంటు పేరుతో.. వందల కోట్ల రూపాయలను తెరాస ప్రభుత్వం జేబులో వేసుకుంటోందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేశ్రెడ్డి విమర్శించారు. మహబూబాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మోదీ ప్రభుత్వం ఏడాది పాలనపై జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 100 యూనిట్లు ఖర్చు పెడుతున్నామని చెబుతూ.. కేవలం 20 యూనిట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారని రాకేశ్రెడ్డి ఆరోపించారు. కేంద్రం నూతనంగా తీసుకువచ్చే విద్యుత్ చట్టంపై ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
సుసాధ్యం చేశాం..
దేశంలో ఉగ్రవాదాన్ని కట్టడి చేసి.. పాక్ గుండెల్లో భారత్ నిద్రపోతోందని రాకేశ్రెడ్డి అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందని స్పష్టం చేశారు. 70 ఏళ్లుగా పరిష్కారం కాని.. ఎన్నో సమస్యలను పరిష్కరించి, ఆర్టికల్ 370ని రద్దు చేసిన అంశాలను గుర్తు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. 52 దేశాలకు మందులను సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన భాజపా జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచందర్ రావు, జిల్లా నాయకులు రాఘవులు, మదన్, నరేశ్, సోమయ్యలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తీవ్ర ఉత్కంఠ.. ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురుచూపు