మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. నకిలీ కూపన్లు సృష్టించి అక్రమార్కులు ఇసుక రవాణాకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నట్లు రైతులు, మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తున్నా.. అధికారులు చూసిచూడనట్లు వ్యవహిరస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా
అధికారుల అండదండలతో ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరుతో అక్రమార్కులు ఇసుక రవాణాకు అనుమతులు పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాణ పనులకు రోజుకు రెండు ట్రాక్టర్ల చొప్పున మాత్రమే తరలించుకోవాలనే నిబంధనలు ఉన్నా.. పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను తీసుకెళ్తున్నారు.
ట్రిప్పుకు రూ.2500 నుంచి రూ.5500 వరకు
తొర్రూరు, మహూబాబాద్, ఖమ్మం, మరిపెడ వంటి పట్టణాలకు ఇసుక తరలిస్తూ ట్రిప్పుకు రూ.2500 నుంచి రూ.5500 వరకు విక్రయిస్తున్నారు. పలు గ్రామాల్లో దళారులు ఏకంగా ఇసుక తరలించుకునేందుకు వేలం పాట పాడుతున్న సందర్భాలూ ఉన్నాయి. అధికారులు అప్పుడప్పుడు మాత్రమే తనిఖీలు చేయడం.. తరువాత పట్టించుకోకపోవడం వల్ల అడ్డూఅదుపూ లేకుండా పోయిందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసి భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని అధికారుల వద్ద ప్రస్తావించగా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవంటున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇదీ చూడండి : చిరుత సంచారం..జనాల్లో భయం భయం..