బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే వరకూ పోరాటం సాగిస్తామని నల్గొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ వామపక్షాల అభ్యర్థి జయసారథి రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం, గార్ల మండలాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బయ్యారంలోని యంపీడీఓ, జిల్లా పరిషత్, ప్రాధమిక పాఠశాలలో ఉద్యోగులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేయాలని అభ్యర్థించారు.
అనంతరం బయ్యారం ఇనుప రాయి గుట్టను సందర్శించి ఇనుప రాళ్లను పరిశీలించారు. బయ్యారం ఉక్కు... తెలంగాణ హక్కు అంటూ నినాదాలు చేశారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటును విస్మరించారని, ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు అయితే స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. స్థానికుడినైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 30 వేలు నింపారని, నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరుతో కేసీఆర్ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ ప్రచారంలో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఆరేళ్లలో భాజపా తెలంగాణకు చేసింది సున్నా : కేటీఆర్