KCR in Mahabubabad Tour: ప్రభుత్వ శాఖలన్నీ ఒకేచోట కొలువుదీరి ప్రజలకు పారదర్శక సేవలందించే లక్ష్యంతో అన్ని జిల్లాల్లో కొత్త సమీకృత కలెక్టరేట్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు అందుబాటులోకి రాగా.. నేడు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.58 కోట్లతో నిర్మించిన ఈ కలెక్టరేట్ సముదాయం అన్ని హంగులతో ముస్తాబైంది. అంతకుముందు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించారు.
జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్, ఎంపీ మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఇతర ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రారంభోత్సవాల అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. సమీక్ష తర్వాత వర్చువల్ విధానంలో జిల్లా గ్రంథాలయాన్ని ప్రారంభించిన సీఎం.. ఆపై కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఉద్యమ సమయంలో మహబూబాబాద్ వచ్చానని.. అప్పట్లో ఈ ప్రాంతంలో బాగా కరవు ఉండేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహబూబాబాద్ కరవుపై తాను పాట కూడా రాశానని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక అనేక పనులు చేసుకున్నామన్న ముఖ్యమంత్రి.. చాలా జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే కలెక్టరేట్లు ప్రజా సమస్యలు తీర్చే కార్యాలయంగా మారాలని ఆకాంక్షించారు.
మహబూబాబాద్ జిల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. దీంతోపాటు పట్టణ అభివృద్ధి కోసం రూ.50 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని మిగిలిన పట్టణాలకు రూ.25 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే అనేక తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామన్న ముఖ్యమంత్రి.. మహబూబాబాద్‌లోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
అప్పట్లో మహబూబాబాద్ ప్రాంతంలో బాగా కరవు ఉండేది. ఇక్కడి కరవుపై పాట కూడా రాశాను. తెలంగాణ వచ్చాక చాలా పనులు చేసుకున్నాం. చాలా జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం. ఈ కలెక్టరేట్ ప్రజాసమస్యలు తీర్చే కార్యాలయంగా మారాలి. మహబూబాబాద్ జిల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్, రూ. 50 కోట్లు కేటాయిస్తున్నాం. మిగిలిన పట్టణాలకు రూ.25 కోట్ల చొప్పున కేటాయిస్తున్నాం. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు మంజూరు చేస్తాం. - ముఖ్యమంత్రి కేసీఆర్
మహబూబాబాద్ పర్యటన ముగియగానే సీఎం హెలికాప్టర్‌లో నేరుగా భద్రాద్రి కొత్తగూడెం వెళ్లారు. అధునాతన హంగులతో పూర్తయిన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని, నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం సభలో ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి ప్రకాశం స్టేడియం చేరుకుని హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్ బయల్దేరనున్నారు.
ఇవీ చూడండి..