CM KCR Mahabubnagar Praja Ashirwada Sabha Speech : తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఉద్యమం ప్రారంభించానని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పిడికెడు మందితో ఉద్యమం ప్రారంభించానని.. తాను తెలంగాణ సాధిస్తానంటే కొందరు నమ్మలేదని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఒక దశలో మోసం చేసిందన్న ఆయన.. ప్రాణాలకు తెగించి నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించానని స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చినందునే మహబూబాబాద్ ప్రత్యేక జిల్లా అయ్యిందన్న కేసీఆర్.. తండాల్లో ఇవాళ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి తాండవిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
BRS Praja Ashirwada Sabha in Mahabubabad : ఈ సందర్భంగా రైతుబంధు కింద ఇచ్చే సొమ్ము వృథా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు వద్దనే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్ లేదన్న కేసీఆర్.. ఒకప్పుడు విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం రైతు బంధు సొమ్ముతో అన్నదాతలకు పెట్టుబడి కష్టం తీరిందని చెప్పారు. రైతు చనిపోతే ఆ కుటుంబానికి వారంలోనే రూ.5 లక్షలు వస్తున్నాయని.. ధరణి పోర్టల్ వల్ల భూ కబ్జాలు తగ్గిపోయాయని స్పష్టం చేశారు.
రైతుల భూమి మీద రైతుకు మాత్రమే అధికారం ఉండాలని ధరణి తెచ్చామన్న కేసీఆర్.. ధరణి పోతే రైతుబంధు, రైతుబీమా ఉండదని తెలిపారు. ధరణి పోర్టల్ తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం పెరుగుతుందని వెల్లడించారు. రైతుబంధు సొమ్మును దశలవారీగా రూ.16 వేలకు పెంచుతామని.. ఆసరా పింఛన్ల మొత్తాన్ని దశల వారీగా రూ.5 వేలకు పెంచుతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మహబూబాబాద్‌కు మరిన్ని విద్యా సంస్థలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
రైతుబంధు కింద ఇచ్చే సొమ్ము వృథా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు వద్దనే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి. ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్ లేదు. ఒకప్పుడు విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడేవారు. రైతుబంధు సొమ్ముతో రైతులకు పెట్టుబడి కష్టం తీరింది. ధరణి పోర్టల్ వల్ల భూకబ్జాలు తగ్గిపోయాయి. రైతుల భూమి మీద రైతుకు మాత్రమే అధికారం ఉండాలని ధరణి తెచ్చాం. ధరణి పోతే రైతుబంధు, రైతుబీమా ఉండదు. ధరణి పోర్టల్ తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం పెరుగుతుంది. - సీఎం కేసీఆర్