ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్ రుసుముల పెంపు రద్దు చేయాలంటూ భాజపా నిరసన దీక్షలు చేపట్టింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు భాజపా గిరిజన మోర్చా అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ దీక్షకు దిగారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ పేరిట పెద్ద కుట్ర చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి ఎల్ఆర్ఎస్, రిజిస్ట్రేషన్ రుసుముల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.