ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెరాస దాడులకు పాల్పడుతోందని భాజపా మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వి.రామచందర్‌రావు ఆరోపించారు. జిల్లాలోని నెల్లికుదురు గ్రామంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్ నాయక్‌పై దాడి చేయడం విచారకరమన్నారు. నియోజకవర్గంలో భాజపా బలోపేతం అవుతుండడంతో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ భయాందోళన చెందుతూ.. భాజపా నేతలపై భౌతిక దాడులు చేయిస్తున్నారని ఆక్షేపించారు.
ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
భాజపా నేతలపై జరిగిన దాడిని నిరసిస్తూ.. భాజపా ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ దిష్టిబొమ్మను దహనం చేశారు. స్థానిక నెహ్రూ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న భాజపా కార్యకర్తలు, నాయకులను పట్టణ సీఐ వెంకటరత్నం అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వారిలో మహబూబాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు రాంచందర్ రావు, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సిరికొండ సంపత్ ఉన్నారు. అల్లర్లు జరుగవచ్చు అనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా 100 భాజపా కార్యకర్తలను ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: అన్ని వర్గాల గొంతుకను వినిపిస్తా: ఎమ్మెల్యే రఘునందనరావు