మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె గ్రామానికి చెందిన చిందు యక్షగానం కళాకారులు ప్రజలకు వినూత్నరీతిలో అవగాహన కల్పించారు. యముడు, చిత్రగుప్తుడి పాత్రలతో కేసముద్రంలోని పుర వీధుల్లో తిరుగుతూ కరోనావైరస్ బారిన పడితే చావుకు సిద్ధమైనట్లేనని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన నియమాలు విస్మరించి రోడ్ల మీద తిరుగుతున్నారని... ఎవరింట్లో వారే ఉండాలని వివరిస్తున్నారు. అధికారులు ఎంత చెప్పినా పట్టించుకోకుండా తిరుగుతున్నారని.. ఇక యమలోకానికి రావలసిందేనని అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తున్నారు.
ఇప్పటికైనా ఎవరింట్లో వారే ఉండి... వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. చేతులు ఎప్పటికప్పుడు కడుక్కుంటూ.. సోషల్ డిస్టేన్స్ పాటించినట్లైతే కరోనాను తరిమేయవచ్చని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కేసముద్రం ఎంపీపీ వోలం చంద్రమోహన్, సర్పంచ్ భట్టు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

