కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలంలో అదృశ్యమైన మహిళ కథ విషాదాంతమైంది. లింగాపూర్ మండల కేంద్రంలో గోపి, లక్ష్మీ బుగ్గలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ఇద్దరూ.. రోజు వారీ పనిలో భాగంగా ఎల్లపటార్ గ్రామానికి చెరో వైపు వెళ్లారు.
గాలింపు చర్యలు...
భార్య లక్ష్మి సాయంత్రమయ్యేసరికి ఇంటికి రాకపోవడంతో గోపి తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిన్న రాత్రి గాలింపు చర్యలు చేపట్టినా... ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం మళ్ళీ గాలింపు చేపట్టారు.
ఎల్లపటార్ తండా, రాంనాయక్ తండాల మధ్యలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉందంటూ స్థానికులు తెలిపిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని పరిశించిన పోలీసులు లక్ష్మిగా గుర్తించారు.
తలపై తీవ్రగాయాలతో...
మృతురాలి తలపై తీవ్ర గాయాలున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున ఘటనా స్థలికి చేరుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ద్విచక్ర వాహనాలను తగలబెట్టి, రాస్తారోకో చేసి ఆందోళన చేపట్టారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని వారికి కఠినంగా శిక్ష పడేలా చేస్తామని ఆసిఫాబాద్ డిఎస్పీ సత్యనారాయణ హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి: పొగతో ఎందుకు? ఒకేసారి బాంబులతో చంపేయండి: సుప్రీం