కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో సోమవారం జరిగిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. కౌటాల మండలానికి చెందిన రౌతు బండుకు దహేగాం మండలం రాళ్లగూడాకు చెందిన కవితతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి 7 సంవత్సరాల వయసు గల కూతురు కూడా ఉంది. బండు ఇల్లరికం అల్లుడుగా వచ్చి రాలగూడలోనే నివాసం ఉంటున్నాడు. సోమవారం నాడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి కేసును ఛేదించారు.
కాగజ్ నగర్ మండలం బురద గూడ గ్రామానికి చెందిన కొత్రాంగి బిక్కుతో సంవత్సర కాలంగా వివాహేతర సంబంధం పెట్టుకుందని విచారణలో తేలినట్లు డీఎస్పీ బీఎల్ఎన్ స్వామి వెల్లడించారు. ఈ విషయంపై బండు భార్య కవితను తరచూ నిలదీస్తూ ఉండేవాడని తెలిసింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న భర్తను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి పథకం రచించింది. భర్త నిద్రపోయాక ప్రియుడిని అర్ధరాత్రి ఇంటికి పిలిపించి... ఇద్దరు కలిసి బండరాయితో మోదీ హతమార్చారు. మృతదేహాన్ని కొత్మిర్ సమీపంలో పత్తిచేనులో పడేసి వెళ్లారు. ఏమీ తెలియనట్లు కవిత పొలం పనులకు వెళ్లింది.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు... తమదైన శైలిలో విచారణ చేపట్టి గుట్టు రట్టు చేశారు. హత్యకేసును చాకచక్యంగా ఛేదించిన కాగజ్నగర్ గ్రామీణ సీఐ అల్లం నరేందర్, దహేగాం ఎస్సై రఘుపతిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
ఇదీ చూడండి: అనుమానస్పదస్థితిలో వ్యక్తి మృతి