కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో 30 పడకల ఆసుపత్రిని ఇటీవలే 50 పడకలుగా ఉన్నతీకరించారు. లింగాపూర్, సిర్పూర్(యు), తిర్యాణి పూర్తి ఏజెన్సీ మండలాల నుంచి ఈ ఆసుపత్రికి గర్భిణులు వస్తున్నారు. ఇక్కడ రేడియాలజిస్టు లేకపోవడంతో ఆయా గర్భిణులంతా అతికష్టం మీద 100 కిలోమీటర్ల పైగా ప్రయాణించి ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో స్కానింగ్ చేయించుకుంటున్నారు. వారందరికీ ముందుగా ఒకసారి వెళ్లి స్కానింగ్ కోసం నమోదు చేసుకోవడంతో కలిపి నాలుగుసార్లు తప్పక వెళాల్సిన పరిస్థితి. జైనూరు ఆసుపత్రిలో స్కానింగ్ యంత్రం ఉన్న నేపథ్యంలో రేడియాలజిస్ట్‌ను ఏర్పాటు చేస్తే గర్భిణులకు ఈ సమస్య తప్పుతుంది. ప్రతి నెలా ఈ ఆసుపత్రిలో 40 ప్రసవాలు అవుతున్నాయి. ఏడాదిలో కనీసం 600 మంది గర్భిణులు రిమ్స్‌కు వెళ్లి స్కానింగ్ చేయించుకుంటున్నారు.
బెజ్జూర్ మండలంలోని కృష్ణపల్లి, తలాయి, సోమిని, మొగవెల్లి, తిక్కపల్లి గ్రామాలకు చెందిన మహిళలు, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్ మండలంలోని పదుల సంఖ్యలో గ్రామాల ప్రజలు 50 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించి కాగజ్‌నగర్ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకుంటున్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి నెలా 325 వరకు సంవత్సరానికి 3,500 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. వీరందరికి ఈ స్కానింగ్ ఇక్కట్లు తప్పడం లేదు.
రిమ్స్‌కు బయలుదేరితే..: జవనరి 2022లో జైనూరు మండల కేంద్రానికి చెందిన దీపా అనే గర్భిణిని స్కానింగ్ నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే చనిపోయింది.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..: ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిల్లో రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్‌లను నియమించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే వీరిని నియమించే ఏర్పాట్లు చేస్తాం. - మనోహర్, డీఎంహెచ్‌వో
ఇవీ చూడండి: