కుమురం భీం జిల్లాలో గత నాలుగు నెలలుగా పులి సంచరిస్తోంది. దీనితో జనాలు రోజూ భయభ్రాంతులకు గురవుతున్నారు. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో పెంచికల్ పేట మండలం కొండపల్లి గ్రామంలోకి పులొచ్చింది. ఆరుబయట ఉన్న పశువులపై దాడి చేసింది. గ్రామస్థుల అరుపులతో పులి అటవీ ప్రాంతానికి వెళ్లిపోయింది. ఇన్నాళ్లు అడవిలోనే కనిపించిన పులి గ్రామంలోకి రావడంతో.. ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఇప్పటికే పులి దాడిలో ఇద్దరు చనిపోయిన తరుణంలో పులిని బందించే చర్యలను పక్కగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. జనవరి 11న బెజ్జుర్ మండలం కంది భీమన్న అటవీ ప్రాంతంలో పులికి మత్తుమందు ఇచ్చి.. పట్టుకునే ఆపరేషన్ ప్రారంభించారు. వారం పాటు.. పులి మహారాష్ట్రకు వెళ్లడంతో... ఆ ఆపరేషన్‌కు బ్రేక్ పడింది. మళ్లీ జనవరి 24న బెజ్జుర్ అడవుల్లో పులి కనబడింది. ఇప్పటి వరకు 6 పశువులను హతమార్చింది. తరచూ కొండపల్లి, నందిగామ్ తదితర గ్రామాల్లో కనిపించడంతో.. ప్రజలు బయటకు రావడానికి సైతం జంకుతున్నారు. ఇకనైనా పులిని బంధించే ఆపరేషన్‌ను ప్రారంభించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: పులి పంజా బాధిత కుటుంబ మౌన వేదన