Two members killed on Land disputes Jakkulapalli Kumuram Bheem Asifabad : భూతగాదాలతో సొంత బంధువులే శత్రువులయ్యారు. రక్త సంబంధీకులే ఒకరిపై ఒకరు పగను పెంచుకున్నారు. వివాదం పెరిగే కొద్ది వారిలో పగ మరింత పెరిగింది. చివరికి గొడ్డళ్లు, వేట కొడవళ్లు, కత్తులతో దాడులు చేసుకున్నారు. ఆస్తి కోసం సొంత వారినే హత్య చేసుకుంటామా..! అనే కనీస జ్ఞానం వారిలో కొరవడింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ భూతగాదాల్లో ఇద్దరు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
ఇది జరిగింది: పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం జక్కులపల్లి గ్రామంలో గత మూడు సంవత్సరాల నుంచి ఓకే ఇంటి పేరుతో గల కుటుంబాల మధ్యల భూతగాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో రెబ్బెన మండల పోలీస్ స్టేషన్లో ఇరువర్గాలు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. అప్పటి నుంచి కేసు కొనసాగుతూనే ఉంది. గ్రామంలో కుల పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. అయినా సయోధ్య కుదరకపోవడంతో ఈ గొడవ కొనసాగుతూ వస్తోంది.
ఈ క్రమంలో నైరుతి రుతుపవనాలు రాకతో వర్షాలు ప్రారంభం కావడంతో మూడు, నాలుగు రోజుల క్రితం 12 ఎకరాల భూమిలో నరసయ్య, బక్కమ్మ, లింగయ్య అనే వ్యక్తులు పత్తి విత్తనాలు నాటినారు. ఇదే క్రమంలో మరో వర్గం వారు అదే పొలంలో పెసర పంట వేయడానికి ఇవాళ వెళ్లారు. ఈ విషయంలో ఇరువురి మధ్య తగాదా జరిగింది. మాటమాట పెరిగి భౌతిక దాడులకు దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన వారు ఒకరిపై ఒకరు గొడ్డళ్లు, కర్రలు, కత్తులతో దాడులు చేసుకున్నారు. సుమారు 15మంది గొడవలో ఉన్నట్లు బాధితులు తెలిపారు.
Land disputes Jakkulapalli Kumuram Bheem Asifabad : ఈ ఘర్షణలో ఇద్దరు మృతి చెందగా.. మరికొంత మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు పేరొన్నారు. గాయపడిన వారిని బెల్లంపల్లిలోని సింగరేణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ గొడవలో వ్యక్తులు కళ్లల్లో కారం చల్లి దాడులకు పాల్పడినట్లు ఒక వర్గం వారు పేర్కొంటున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గొడవలో ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... ప్రస్తుతానికి దాడి చేసిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రెబ్బెన మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే గ్రామంలో ఇద్దరు హత్యకు గురికావడంతో విషాదం నెలకొంది.
ఇవీ చదవండి: