టేకు లక్ష్మి హత్యోదంతంపై పురోగతి లేదంటూ కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం రామ్ నాయక్ తండ-ఎల్లపటార్ గ్రామాల మధ్య గత నెల 24న జరిగిన టేకు లక్ష్మి హత్య ఘటన తెలిసిందే..
ఘటన జరిగి పక్షం రోజులు అయినప్పటికీ కేసులో పురోగతి లేదని ప్రజాసంఘాల సంఘాలు, కుల సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేశారు. నిందితులను వెంటనే శిక్షించాలంటూ నినదించారు.
నిత్యం ధర్నాలు
కొన్ని రోజులుగా టేకు లక్ష్మి కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలి.. నిందితులను వెంటనే శిక్షించాలంటూ లింగాపూర్, సిరిపూర్ యూ, జైనూర్ మండలాల్లో కులం సంఘాల నేతలు, స్థానికులు ధర్నాలు చేస్తున్నారు.
వాళ్లకో న్యాయం... మాకో న్యాయమా?
దిశ కేసులో నిందితులను శిక్షించిన పోలీసులు.. లక్ష్మి హత్య ఘటనలో నిందితులను ఎందుకు శిక్షించడం లేదని బాధిత కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే దిల్లీ వరకు పాదయాత్ర చేసి తమ సమస్యను దేశం మొత్తానికి తెలియజేస్తామన్నారు. ఇప్పడికైనా అధికారులు, నేతలు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: దిశ నిందితుల ఎన్కౌంటర్ సరికాదు: డి.రాజా