కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో పలు కారణాల వల్ల మూతబడిన ఎస్పీఎం పరిశ్రమను ప్రభుత్వం కార్మికుల సంక్షేమ దృష్ట్యా పలు రాయితీలు కల్పించి.. పునఃప్రారంభించింది. ప్రస్తుతం పరిశ్రమలో 250 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కొవిడ్ 19 కారణంగా ప్రస్తుతం పరిశ్రమలో షట్‌డౌన్ విధించి అత్యవసర సేవలు మాత్రమే నడిపిస్తున్నారు. అయితే పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయంటూ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక యువతకు ఉపాధి కల్పించక పోగా.. పర్మనెంట్ కార్మికుల చేత కాలువలు శుభ్రం చేయించడం, గడ్డి పీకించడం లాంటి పనులు చేపిస్తున్నారని ఎస్పీఎం తెలంగాణ వర్కర్స్ యూనియన్ కోశాధికారి సూర్య ప్రకాశ్‌రావు ఆరోపించారు. ఇదేంటని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. జీతాలు సైతం సరిగా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి, కార్మిక శాఖకు, అధికారులకు లేఖ ద్వారా విన్నవిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ దృష్టి సారించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్.. స్మార్ట్‌ఫోన్ కానుక