కరోనా కారణంగా పేదలకు నవంబర్ వరకు ఉచిత రేషన్ ప్రకటించగా... కొన్ని నిబంధనలు లబ్ధిదారులకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. రేషన్ కార్డుకు, సెల్ఫోన్ నంబర్ అనుసంధానం అనే నిబంధనతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. 15 కిలోల ఉచిత బియ్యం తీసుకుందామని వెళితే ఓటిపీ రావడం లేదని రేషన్ డీలర్లు తిప్పి పంపిస్తున్నారని వాపోయారు. అనుసంధానం కోసం మీ-సేవ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
నేటికీ ఆధార్ కార్డుకు తమ ఫోన్ నంబరు అనుసంధానం చేసుకోనివారూ ఉన్నారు. పేదలు, వృద్ధులు ఫోన్ లేక అనుసంధానం చేసుకోలేకపోతున్నామని వాపోయారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట మండలం చెడా గ్రామానికి చెందిన వృద్ధురాలు పోచమ్మ ఈ సమస్య కారణంగా నాలుగు నెలలుగా రేషన్ బియ్యం తీసుకోలేదని వాపోయారు. ఇలాంటి సమస్య చాలామందికి ఉంది. కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లాగౌడ్ తోట, పురపాలక కార్యాలయం, దక్కన్ గ్రామీణ బ్యాంకులో మీ సేవ కేంద్రాలున్నాయి. ఆయా మండలాల లబ్ధిదారులు అనుసంధానం కోసం వేకువజామునే ఈ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు. మీసేవా కేంద్రాల్లో కరోనా నిబంధనలు పాటించడం లేదు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి