కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం పరిశ్రమలో ఈరోజు ఉదయం జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఉదయం 6గంటల 30 నిమిషాలకు గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకోగా.. యాజమాన్యం గోప్యంగా ఉంచింది. కార్మికుడు నాగుల రాజం అస్వస్థతకు గురవడం వల్ల కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పలు ఛానళ్లలో వార్త ప్రసారం అవడం వల్ల ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
సిర్పూర్(టి) తహసీల్దార్ లింగమూర్తి ఆధ్వర్యంలో సిర్పూర్(టి) మండలాధికారి శ్రీనివాస్, తదితరులు విచారణ చేపట్టారు. లీకేజీ ఘటనపై పరిశ్రమ ప్రతినిధులను వివరణ కోరారు. అనంతరం ఘటనాస్థలిని సందర్శించి, కార్మికుల నుంచి సమాచారం సేకరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు నాగుల రాజంను కలిసి జరిగిన ఘటనపై వివరాలు నమోదు చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని తహసీల్దార్ లింగమూర్తి తెలిపారు.
ఇవీ చూడండి: కాగితపు పరిశ్రమలో గ్యాస్ లీక్... రహస్యంగా ఉంచిన యాజమాన్యం